తెలుగు సంగతులు

సోమవారం, డిసెంబర్ 19, 2016

సోమయ్య కే కాదు నాలాంటి వారికి ఎందరికో నచ్చే వ్యాసాలు.

వాడ్రేవు చినవీరభద్రుని "సోమయ్యకు నచ్చిన వ్యాసాలు" వివిధ విషయాల సమాహారం. తాత్విక చింతన, సునిశిత విశ్లేషణ, విషయ విస్తృతి, అదే సమయంలో వ్యాస క్లుప్తత, సమకాలీన సంఘటనలపై తర్కంతో కూడిన వివరణ --- ఇవీ చినవీరభద్రుని వ్యాసాల్లో మనకి స్పష్టంగా కనిపించేవి. ప్రకృతి పారవశ్యం, కవిత్వపు మధురానుభూతీ, సామాన్య- సంప్రదాయ జీవన పరిమళాలూ, వివిధ వాదాల రంగరింపు, కళలపై అపారమైన మక్కువ వగైరా విభిన్న అనుభూతుల్ని చవి చూడొచ్చు - వాడ్రేవు వ్యాసాల్లో. అందుకే అవి సోమయ్యగారికి మాత్రమే నచ్చేవి కాదంటాను.
అనేక పార్శ్వాలు కనపడతాయి. వివిధమైన దర్శనాలు చెయ్యొచ్చు. డి.ఎన్.ఏ, గ్లోబలైజేషన్ (గ్లోబల్, లోకల్ కలిపి గ్లోకలైజషన్ గా పేరు పెట్టడం సముచితం), క్రికెట్ పై వెర్రి వ్యా'మోహం',  ఒక చిత్రకారుని అంతరంగ విశ్లేషణ, మహాత్ముల ఆలోచనల మదింపు, సారాంశ సంగ్రహం, ప్రాచీన బౌధ్ధ ధర్మాలలోని ఔచిత్యం, శంకరాచార్యుని కర్మ - జ్ఞాన సాపేక్షతా దృష్టిపై చూపు -- ఇలా ఏ విషయమయినా ఆయన వ్యాసాల్లో మనకు లభ్యమవుతాయి. అటువంటి ప్రతి చింతనా తాత్వికంగా, మనసుకు హత్తుకుపోయేలా ఉంటాయి. సరళంగా మొదలయ్యే ప్రతీ వ్యాసం కొన్ని పేరాల కూర్పుతోనే ఎంతో లోతులకు పయనించి తాత్వికమైన ముగింపు కాని 'ముగింపు ' కు తీసుకెళ్తాయి. ఆ రెండు మూడు పేజీల వ్యాసంలో ఉన్న నిగూఢత, గాఢత ఆ విషయంపై మనల్ని పరిశోధన చేయించేంతగా ప్రభావితం చేస్తాయి. 

ఈ సోమయ్యకు (రావెల) నచ్చిన వ్యాసాలు సుమారు పుష్కరకాలం పాటు అంటే 2000 నుండి 2012 సవత్సరాల  మధ్య కాలంలో  వాడ్రేవు వివిధ పత్రికలకు (ఇండియా టుడే, నవ్య, యువభారతి) వ్రాసినవి. అప్పటి చర్చనీయాంశ విషయాలతోబాటు, కళలు, కవిత్వం,తర్కం- తాత్వికం మొదలైన విషయాల చర్చలో వివిధ కాలాలకు, వివిధ దేశాలకు చెందిన ఎంతోమంది మేధావులను ఉటంకించడం, ప్రత్యేకించి చర్చించడం ఉంటుంది. మనల్ని అక్కడే ఆపేసి ఆయా మేధావుల గురించీ, ఆ తత్వాల విశ్లేషణ గురించీ తెలుసుకోవాలన్న జిజ్ఞాసను రేకెత్తించి - మనల్ని వివిధ గ్రంధాల వైపు, అంతర్జాలం వైపూ పరిగెత్తిస్తాయి. 

అయితే ఇక్కడొక చిక్కు కూడా ఉంది. నావరకూ నాకు కలిగే చిక్కూ, ఇబ్బందల్లా -- పదాల ప్రయోగం, వాటి సంక్లిష్టతానూ. ఇంగ్లీషు - తెలుగు నిఘంటువునే ఎక్కువ సందర్భాల్లో వినియోగించే నేను, ఈ వ్యాసాలు చదువుతున్నప్పుడు తెలుగు - ఇంగ్లీషు ( రెండూ పి. శంకరనారాయణవే) నిఘంటువును అందుబాటులో ఉంచుకోవలసి వచ్చింది. ఉదాహరణకు కొన్ని పదాలు -- నిశ్శ్రేయసం, పరాస్తం, యాదార్ధ్యాలు - వంటివి నాకు అర్ధం అయ్యీ, అవ్వక అక్కడే నిలువరించేస్తాయి. బహుశా ఆ సంక్లిష్టత నా భాషా పరిజ్ఞానపు అధమ స్థాయి అయినా కావచ్చు. లేదా సరైన భావ వ్యక్తీకరణకు చిన వీరభద్రునికి మార్గాంతరం లేక, కావొచ్చు. అంతేగాని పాండిత్య ప్రకర్ష అనుకోవడానికి ఆస్కారం లేదు. ఆ సంక్లిష్ట పదాల స్థానంలో వేరే సరళ పదాన్ని ఊహించుకున్నా అసంతృప్తిగానే ఉంటుంది. ఈ నా సమీక్షలో వాడిన ఈమాత్రం పదాలకు కారణం - ఆయన వ్యాసాలలోని భావ వ్యక్తీకరణకోసం వాడిన భాష తాలూకు పూనకం కావొచ్చు. ఇటువంటివి ఈ కాలానికి బహు గ్రాంధికం అనిపించడంలో ఆశ్చర్యం లేదు.బహుశా అంతటి విషయ తీవ్రతను వ్యక్తపరచడానికి ఆ సంక్లిష్ట పదబంధాలు అవసరమేమో! వ్యాసాల విశిష్టత కు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో ఈ క్లిష్టమయిన పదాల వల్ల నా వంటి సగటు పాఠకుడికి కలిగే చిన్నపాటి ఇబ్బంది పరిగణనలోకి తీసుకోనక్కర లేదనుకుంటాను.
శ్రీప్రచురణ వారి ప్రచురణ. 476 పేజీలు. 250 రూ.వెల